Monday, March 30, 2026

Chaitanya Chemantulu 51 To 100 Of 242#swami_sundara_chaitanyananda#ARCHIVE ORG VIDEO DOWNLOAD LINK

    


ARCHIVE ORG VIDEO DOWNLOAD LINK
CLICK HERE

51. భక్తితో వేడుకొనే వాడు భక్తుడు. శక్తితో కాపాడేవాడు భగవంతుడు.

రెండు చేతులతో ఆరాధించేవాడు భక్తుడైతే, నాలుగుచేతులతో

ఆశీర్వదించేవాడు భగవంతుడు. అందుకేఆయన చతుర్భుజుడు.

52. పరులలో దోషాలున్నాయని, ద్వేషాలున్నాయని కలతపడటం దేనికి? అవి మనలో లేనందుకు పరమేశ్వరునికి కృతజ్ఞతలు  తెలుపుకోవాలి.

53. నిమిషం నిలబడని యవ్వనం, క్షణంకూర్చోలేని వృద్ధాప్యం

సుఖపడేది క్షణం. కష్టమే బ్రతుకులో అనుక్షణం.

54. ప్రేమలున్నచోట ప్రేమల్ని నిరోధించడం ఎలాసాధ్యపడదో, ప్రేమలేనిచోట ప్రేమను ఊరేగించడం కూడా సాధ్యపడదు. ప్రేమ అనేది ఆంతర్యంలో ఊరేదే గాని, బయటనుండి కూరేదికాదు; వచ్చిదూరేదీకాదు.

55. పోరాటం దేనికోసం? పోరాటం పోరాటంకొరకా? శాంతికొరకా? బ్రతుకంతా పోరాటమే అయితే, ఇకశాంతి ఎప్పుడు? పోరాటంలో గెలిస్తే శాంతిరాదు. పోరాటం అవసరంలేదని తెలిసినపుడే శాంతి.

56. అశక్తతని అర్థం చేసుకోవడానికి కూడా మనిషి శక్తివంతుడై ఉండాలి.అసమర్థతని అర్థం చేసుకోవడంలోనే సమర్థతకు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది అనేసత్యం అందరికీ అర్థమయ్యేది కాకపోయినా, అందరూ శ్రమించి అర్థం చేసుకోవలసింది

57. రోదన లోనే సాధన మొదలవుతుంది. సాధనలోనే వేదన

అదృశ్య మవుతుంది. ఇక బ్రతుకంతా అచ్యుతుని అనుగ్రహంతో హాయిగా సాగిపోతుంది.

58. 'నా బిడ్డలను సుఖ పెట్టాలి' అనేభావం మంచిదే. కాని 'నాబిడ్డలు సుఖపడాలి' అనేభావం ఇంకామంచిది. చాలామంచిది.చాలా మంచి గొప్పది.

59. గురుదేవుని అర్థం చేసుకొనే ప్రయత్నం వ్యర్థం. గురుబోధను అర్థం

చేసుకొని జీవించడమే పరమార్థం.

60. అశ్రద్ధకు కాళ్ళు లేవు. అందుకనే, ఎప్పుడూ కూలబడి ఉంటుంది. శ్రద్ధకు రెక్క లున్నాయి. అందుకనే, గగన విహారం చేస్తూ ఉంటుంది.

61. జన్మను కలిగించేది కామం. మృత్యువును ముందుంచేది కాలం.

కాలం లోనే కామాన్ని జయించాలి. కామ జయంతో కాలుని దహించాలి.

62. అనిత్యాలను వాటేసుకుంటే అవి కాటేసి తీరుతాయి. కాటేసేందుకే

అవి మాటేసుకొని ఉంటాయి.

63. అన్నీ ఉన్నట్లే ఉంటాయి. ఏవీ మనవి కాకుండా పోతాయి. ఏదీ చేతిలో నిలవదని ఒక వైపు అర్థమౌతున్నా, బ్రతుకును మరోవైపు చేజేతులా పాడు చేసుకుంటున్నాం.

64. బాధలే బోధలయ్యేటట్లయితే, పరితాపాలే మనుషులలో పరివర్తనను తెచ్చేటట్లయితే, అందరూ పరివర్తనచెందే ఉండాలి. బాధలు

అనుభవించడం వేరు. బాధల నుండి పాఠాలునేర్చుకుని బాగుపడటం వేరు.

65. ఇతరులకు ఏ మాత్రం సేవచేసే అవకాశం ప్రాప్తించినా, అదితనను

సేవించడానికి భగవంతుడు నీపై మోపిన అనుగ్రహమని మరచిపోకు.

అవకాశాలన్నిటిని ఆరాధనలుగా మలచుకో.


66. నీకు నీవు తోడు కానపుడు ఏదితోడున్నా, ఎవరు తోడున్నా, వాస్తవానికి అదంతా తోడు కాదు. నీడే. ఛాయే.మాయే.

67. ఆత్మీయులు మన సుఖంకోరుతారు. ఆచార్యుడు మన హితం కోరుతాడు. వచ్చి పోయేది సుఖం. వచ్చి ఉండేది హితం. సుఖం అనిత్యం. హితం నిత్యం.

68. తామరాకుపై నీటిబొట్టు, క్షణంలోనే ఆటకట్టు. ఊరేగేది పోయేందుకే.

ఉండేది ఊరు ఏగేందుకే.

69. దేహాలన్నీ ఒకే ఆహారం భుజించడం లేదు. కానీ, దేహాలన్నీ శ్మశానంలో ఒకే రంగు గల బూడిదగా కనిపిస్తున్నాయి. సాధకులు ఏమార్థంలో పయనించినా, గమ్యముచేరిన నాడు అది అద్వైతమే. అదే విభూతి సుందరుని వైభవం.



70. మనం ఉన్న దానిని చూస్తున్నామా? లేక మనలో ఉన్న

దానినిచూస్తున్నామా? మనలో ఉన్న దానిని చూస్తే అది దృక్పథం. ఉన్న దానిని ఉన్నట్లుగా చూడటం సత్యపథం.

71. మనకు తెలిసిందే ప్రపంచం అనుకుంటే, ప్రపంచంలో ఏదీ తెలియకుండా పోతుంది. ప్రతి క్షణము తెలుసు కోవాలి అనే ఆసక్తి,

ఆతృత ఉంటే అను క్షణము జీవితంలో జ్ఞానం అందుతూనే ఉంటుంది.

72. లేదు ఇలలో సొంతం. ఇక దేనికొరకు పంతం? చూపు ఉంటే వెలిగేవి

కళలు. చూపు పోతే మిగిలేవి కలలు.

73. ధ్యానం చేస్తే ప్రశాంతత వస్తుంది. కాని, ప్రశాంతత లేనిదే ధ్యానం

కుదరదు అనే సత్యం ధ్యానం చేస్తే గాని అర్థం కాదు. వైరుధ్యం లేకుండా

జీవించడము లోనే బ్రతుకు నైవేద్యంగా మారుతుంది.


74. ఉన్నది మనది కాదు; పట్టుకున్నది మనది. దాచి పెట్టుకున్నది మనది

కాదు; పరులకు పెట్టుకున్నది మనది. ప్రక్కన పెట్టుకున్నది మనది కాదు;

ప్రక్కవారికి పెట్టింది మనది.

75. పట్టేవాడు ఉంటేనే పెట్టేవాడు ఉంటాడు. పెట్టే వాడికి కీర్తి కిరీటం

పెట్టే వాడు పట్టేవాడే.

76. ద్వైతంలో ఏదైనా జరగవచ్చు; ఆశ్చర్యం లేదు. శివుణ్ణి భయపెడుతూ

భస్మాసురుడు వెంట బడ్డాడు. తానే భయపడి అర్జునుడు కూలబడ్డాడు.

అంతా ద్వైత నాటకమే. 

77. మనస్సు ఎక్కడుంది? అనేది ముఖ్యం కాదు. మనస్సులో ఏముంది?

అనేది ప్రధానం. మనస్సులో ప్రపంచంఉంటే, ప్రపంచంలోనే మనస్సు తిరుగుతుంది. మనస్సులో పరమాత్మఉంటే, మనస్సు పరమాత్మ సన్నిధి లోనే ఉంటుంది.

78. ఖాళీ అయితేనే నిండేది. మనస్సు ఖాళీ అయితేనే ధ్యానంపండేది.

ఖాళీ చేసుకొనే ప్రక్రియ కూడా ధ్యానం లోని విషయమే. ధ్యాన

విషయమేదైనా ఉపకారియే. విషయధ్యానం ఎప్పు డైనా, ఎవరికైనా

అపకారియే.

79. కాలం ప్రాణం పోసిన క్షణం కాలాన్ని కబళిస్తోంది క్షణక్షణం. ఉన్నదేదీ కాదు మనంమనమే మనలోఉన్న నిజం.

80. 'చాలు' అనేది చిన్న పదమే. కాని, ఆఒక్క మాటను పలకడానికి

మనిషికి యుగాలు సరిపోలేదు.

81. పరుల కన్నీటిని తుడవటం శ్రేయస్కరము. తుడిచే వాడికి రెండుచేతులే. కార్చేవారికి ఎన్నికళ్ళు? ఎవరి కన్నీటినివారు

తుడుచుకొనేలా చేయగలిగితే, ఆ తరువాత కన్నీళ్ళు కనిపించవు.

ఆవేదనలు అగుపించవు.


82. చావు అనేది అందరికీ ఉంది. అది ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. వచ్చినా అది క్షణంలో తనపని పూర్తిచేసుకొని పోతుంది. ఆ క్షణం ఎప్పుడని బ్రతికినంతకాలం ఆలోచించడమా? ఎందుకొచ్చినవి

ఈ చావుఆలోచనలు?

83. రాయిలో ప్రతిబింబించే శక్తి ఉంది. కాకపోతే పదును పెట్టాలి.

ప్రతిఫలించే శక్తి నీటి కుంది. కాకపోతే, నీరు కదలకుండా ఉండాలి.

చైతన్యాన్ని వ్యక్తం చేసే శక్తి చిత్రానికి ఉంది. కాకపోతే అది చలించకుండా ఉండాలి. నిశ్చలంగాఉండాలి. నిర్మలంగాఉండాలి.

84. ధనానికి విలువ ఉంది. ధనంలోవిలువ లేదు. ఇదిఅర్థమైతే

ధనం దైవంలా శోభిస్తుందేగాని పిశాచంలా పీడించదు.

85. మనం ఓడిపోవాలని భగవంతుడు మనల్ని సృష్టించ లేదు. గెలవాలనే పట్టుదలను పోగొట్టుకొని గెలుపును ఓటమిగా మనమేమార్చుకుంటున్నాం.

86. కొండపైఉన్న మేఘాలతో కొండకుసంబంధం సంబంధం లేదు.

అనంతాత్మపైన నీకు అనిత్యాలతోసంబంధం లేదు. కలిసిఉన్నట్లుఉన్నా.

కలవనిసంబంధాలను అర్థంచేసుకుంటే కలతలు ఉండవు.

87. బాహ్యంలో చలనాలు, ఘర్షణలుఉంటే ఉండనీ, ఆంతర్యంలో

సంచలనాలు, సంఘర్షణలు లేకుండాచూసుకో. ఇదే రాగంలేని స్థితి

ద్వేషం తలెత్తని పరిస్థితి.

88. భక్తుడు ఉదాసీనుడు. ఉదాసీనుడు అంటే, దేనిని పట్టించుకోనివాడు

అనికాదు. దేనినీ పట్టించుకున్నా, దానికి పట్టుపడనివాడు. ముట్టీముట్టనివాడు. అంటీ అంటనివాడు. ఉన్నట్లే ఉన్నా లేనివాడు.

అద్దంలాంటివాడు. అద్దంలాగా అర్థం చెప్పేవాడు.

89. చూడకూడని వాటిని చూడకపోవడం, వినకూడనివాటిని వినకపోవడం బహిరంగ సాధన. చూసినామనస్సు వాటిని పారేసుకోవటం, వినినావాటిని జారేసుకోవటం అంతరంగ సాధన.

90. ఆలోచించకూడని వాటిని ఆలోచిస్తూపోతే, ఒకదశలో మనఆలోచనల్ని మనమే భరించలేని స్థితివస్తుంది. విలువలేని వ్యక్తుల పలవరింతలకు, కలవరింతలకు విలువ కట్టడం ప్రారంభిస్తే, ఆతరువాత మన జీవితమే విలువలేనిదిగా మారిపోతుంది.

91. ‘నాస్తి విద్యాసమం చక్షుః’ జ్ఞానంతోసమానంగా చూచే కళ్ళులేవు. నేత్రాలు చూడలేని సత్యాలను చక్కగా, సుస్పష్టంగా దర్శిస్తుంది జ్ఞాననేత్రం.

92.బాధలకు, భయాలకు ప్రపంచం కారణం కాదు. ప్రపంచంలో

భయకారణాలు, బాధా కారణాలు లేవని తెలియకపోవడమే

మనలోభయాలకు, బాధలకు కారణము. అవగాహనా రాహిత్యమే

బ్రతుకును ఆవేదనా నిలయంగా మార్చేస్తుంది.


93. దానము కరభూషణము. సత్యము కంఠాభరణము. శాస్త్రము వీనులకు అలంకారము. ప్రశస్తమైన ఈ ఆభరణాలను ధరించేవారికి సువర్ణ 

ఆభరణా లెందుకు?

94. లేని వాళ్ళను ఎవ్వరూ పిలవరు. ఉన్న వాళ్ళే అయినా పిలిస్తేగానిరారు.

పరమాత్మ ఉన్నవాడే. పిలిస్తే పలుకుతూ వచ్చేవాడే. పిలిచేసంస్కారమే

బుద్ధికి పట్టాలి. ఇదిఅభ్యర్థన కాదు; ప్రార్థన.

95. ఇది లేదు - అది లేదు అనినిద్రలో అనిపిస్తూ ఉందా? లేదు.

అందుకే నిద్ర హాయి. మెలకువలోకూడా లేదు అనేది లేకుండా పోతే,

ఉన్న హాయి అంతా మనదే అవుతుంది. మనమే అవుతుంది.

96. నిన్ను నడిపే శక్తిని నీ వద్దే ఉంచుకో. కళ్ళెమును ప్రపంచం చేతికిచ్చి

బ్రతుకును ఖాళీ పళ్ళెముగా మార్చుకో వద్దు.

97. మనస్సు ప్రపంచంలో పచార్లుచేస్తే దోషం లేదు. మనస్సులో మాత్రం

పరమేశ్వరుడే ఊరేగుతూ ఉండాలి.










98. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ మంచిగానే అగుపిస్తారు.

కాని, మంచిగా ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉన్నారని చెప్పలేము.

అదే లోకంపోకడ.

99. ఆత్మ ప్రమాణ ఫలం కాదు. అది అప్రమేయము. ఈ సత్యాన్నిదర్శించిన

జ్ఞానులు మౌనంగాఉంటారు. అర్థం చేసుకున్న వివేకవంతులు ఆలపించే

ప్రయత్నం చేస్తారు. అర్థం గాని మూర్ఖులు వితండవాదాలు వినిపిస్తూ

ఉంటారు.

100. మనకు ఏవైనా ఉండవచ్చు.మనకు ఉన్నవి మనల్ని బాధించవు.

మనవిగా ఉన్నవే మనల్ని బాధిస్తాయి.బంధిస్తాయి. ప్రపంచంలో ఉన్నవన్నీ

పరమేశ్వరునికి సంబంధించినవేగాని మనవికావు. వస్తువు

భగవంతునిది. వినియోగము మనది. ఈ అవగాహన బ్రతుకును

ఆనందంగా ఉంచుతుంది.


No comments:

Post a Comment