Friday, August 25, 2023

#చైతన్య భగవద్గీత - 8వ శ్లోకం మరియు వ్యాఖ్యానము

#చైతన్య భగవద్గీత - 8వ శ్లోకం మరియు వ్యాఖ్యానము 
శరీరం య దవాప్నోతి యచ్చా పుత్రామ తీశ్వరః | 
గృహీ త్వైతాని సంయాతి వాయు ర్దన్దా ని వాశయాత్ || 8 || 
అర్జునా! గాలి పోతూ పోతూ పువ్వుల లోని పరిమళాన్ని వెంట తీసుకొని పోతుంది. అలాగే జీవుడు ఒక శరీరాన్ని విడిచి పెట్టి మరొక శరీరంలో ప్రవేశించే టప్పుడు ఇంద్రియ మనస్సులు ఆరింటిని వెంట పెట్టుకొని పోతాడు. వ్యాఖ్య దేహాది సంఘాతానికి ప్రభువైన జీవుడు ఎప్పుడైతే ఉత్రమిస్తున్నాడో, అంటే పైకి లేస్తున్నాడో అప్పుడు, మనస్సు ఆరవదిగా గల ఇంద్రియాలను ఆకర్షిస్తున్నాడు, లేదా లాగుతున్నాడు అనే అర్థ ప్రాధాన్యాన్ని అనుసరిస్తూ, పూర్వ శ్లోకము యొక్క ద్వితీయ పాదాన్ని ముందుగా గ్రహించి ప్రస్తుత శ్లోకముతో అన్వయించుకోవాలి. అప్పుడు, జీవుడు పూర్వ శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని పొందునపుడు మనస్సు ఆరవదిగా గల ఇంద్రియా లను వెంట పెట్టుకొని వెళ్తాడు అనే భావం స్పష్ట మవుతుంది. ఎలా వెళ్తాడు? ఆ విషయాన్నే సోదాహరణంగా ప్రస్తుత శ్లోకంలో చెబుతున్నాడు. వెనుకటి శరీరాన్ని విడిచి వేరొక శరీరంలో ప్రవేశించుటకు ఉత్రమిస్తున్న సమయంలో దేవాది సంఘాతానికి ప్రభువు (ఈశ్వరః) అయిన జీవుడు ఇంద్రియ మనస్సులను ఆకర్షిస్తున్నాడు. ఈ సందర్భములో దేహాది సంఘాత స్వామిని ఈశ్వరుడు అంటున్నాడు (ఈశ్వరః దేహాది సంఘాత స్వామీ జీవః). అంటే, జనన మరణాల విషయంలో ప్రస్తావించ బడుతున్న జీవుడు స్వరూపతః ఈశ్వరుడే. ఈశ్వరుడు చైతన్య రూపుడు కనుక అతనికి జననమరణాలు లేవు. కర్తగా, భోక్తగా జీవుడు వ్యావహారికంగా పిలువ బడుతున్నా, వాస్తవానికి అతడు కర్తా కాడు, భోక్తా కాడు. దేహేంద్రియ మనస్సులతో తాదాత్మ్యం చెంది ఉండటం చేత జీవుడు భోక్త అనే ఆరోపణ జరుగుతోంది. ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే త్యాహు ర్మనీషిణః| దేహము, ఇంద్రియాలు, మనస్సుతో కూడిన జీవుణ్ణి భోక్త అని చెబుతారు అన్నది కఠోపనిషత్తు. భోక్త కనుక, జీవుడు సంసారి అయ్యాడు. అంటే, దేహేంద్రియ మనస్సులతో తాదాత్మ్యము లేనపుడు జీవుడు భోక్త కాడనే కదా అర్థం? అవును. కానీ, ఈ తాదాత్మ్యము ఆధ్యాసిక మని ముందే చెప్పుకున్నాం కదా! కనుక జీవుడు ఎన్నడూ భోక్త కాలేడు. ఎందుకని? కర్త కాడు కనుక. జీవుడు కేవలం చైతన్య రూపుడే కావడం చేత జీవునికి భోక్తృత్వం లేదు ( న హి కేవలస్య ఆత్మనః భోక్తృత్వం అస్తి కర భాష్యము ). జీవునికి భోక్తృత్వము స్వతఃసిద్ధము కాదు. ఆరోపితము. ఒకవేళ కర్తృత్వ భోక్తృత్వాలు జీవునికి స్వభావములే అయితే, స్వభావము నశించదు కనుక జీవుడు నిత్య సంసారి అవుతాడు. కనుక, ఉపాధి స్థాయి నుండి జననమరణాలు చెప్పబడుతున్నాయే గాని, వాస్తవానికి జీవునికి చావు పుట్టుకలు లేవు. ముక్క లయ్యేది కుండే గాని కుండ లోని ఆకాశం కాదు కదా! కనుకనే, సనాతనుడైన జీవుడు బ్రహ్మము యొక్క అంశమే అని చెప్పడం జరిగింది (15 వ అ - 7వ శ్లో). కుండను తీసుకొని పోతూ ఉంటే, కుండ లోని ఆకాశాన్ని కూడా తీసుకొని పోతున్నట్లు అనిపిస్తుంది. ప్రయాణం చేసేది కుండే గాని కుండ లోని ఆకాశం కాదు. ఘటాకాశము ప్రత్యేకంగా ఎక్కడుంది పయనించ డానికి? ఘటాకాశము మహాకాశము నుండి వేరైనది ఎప్పుడు? ఘటాకాశమును ఆరోపించడం చేత ఘటం పయనిస్తూ ఉంటే, ఘటాకాశం కూడా చలిస్తూ ఉందని భ్రమిస్తున్నాము. వాస్తవానికి ఘటమే ఆకాశంలో కదులుతూ ఉంది. అలాగే మరణంలో స్థూల దేహము నుండి సూక్ష్మ దేహము విడిపడి మరో శరీరంలో ప్రవేశిస్తూ ఉంటే, జీవుడు ప్రయాణం చేస్తున్నట్లు మనం ఆరోపిస్తున్నాము. జీవుడు ఈశ్వరుడే కనుక రాకపోకలు లేని వాడు. జననమరణాలు తెలియని వాడు. అందు చేతనే ఉపనిషత్తులు జీవుని కర్మాకర్మలను ధ్యాయతి ఇవ, లేలాయతి ఇవ- జీవుడు ధ్యానించు వాని వలె, చలించు వాని వలె ఉన్నాడు అని ప్రబోధించాయి. అలాగే జననమరణాల మధ్య కూడా జీవుడు పయనిస్తున్నాడు. అనుకుంటున్నాము. వాస్తవానికి పయనించు వాని వలె ఉన్నాడు. ఇక్కడ 'వలె' (ఇవ) అనేది చాలా ప్రధానమైన విషయము. ఇక ప్రయాణం ఎలా సాగుతూ ఉందో చూద్దాం. 
జీవయానము 
అర్జునా! జీవుడు వెనుకటి శరీరాన్ని విడిచే టప్పుడు గాని (ఉత్కామతి), వేరొక శరీరాన్ని పొందే టప్పుడు గాని ( అవాప్నోతి), గాలి పువ్వుల నుండి సుగంధాన్ని వెంట పెట్టుకొని పోయినట్లు, ఇంద్రియ మనస్సులను వెంట పెట్టుకొని పయనిస్తాడు. పువ్వులలో సువాసన ఉంది. వాయువు సువాసనను తీసుకొని పోతుందే గాని, పువ్వులను తీసుకొని పోదు. పువ్వులు అక్కడే ఉంటాయి. గాలి సుగంధాన్ని మాత్రమే వెంట పెట్టుకొని పోతుంది. మరణంలో స్థూల దేహము పువ్వు లాగా అక్కడే ఉంటుంది. పువ్వు లోని సౌరభాన్ని గాలి తీసుకొని పోయినట్లు, స్థూల దేహం లోని సూక్ష్మ దేహాన్ని మాత్రమే జీవుడు వెంట పెట్టుకొని పోతాడు. పుష్పాలు స్థూల శరీరాలు. గంధాలు పుణ్య పాపాది వాసనా యుతమైన సూక్ష్మ శరీరాలు. వాయువు జీవాత్మ. గాలి ఎలాగైతే పువ్వును విడిచి పెట్టి సుగంధాన్ని వెంట పెట్టుకొని పోతుందో, జీవుడు అలాగే స్థూల దేహాన్ని విడిచి పెట్టి సూక్ష్మ దేహాన్ని వెంట పెట్టుకొని వెళ్తాడు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. జనన మరణాలలో ప్రయాణం సాగించేది సూక్ష్మ దేహమే గాని జీవుడు కాడు. స్థూల దేహమూ కాదు. స్థూల దేహము శ్మశానంలో అంత మవుతుంది. జీవుడు అంతమయ్యే వాడు కానందున నిత్యుడై ఉంటాడు. సూక్ష్మ దేహము మాత్రం అజ్ఞానము అంతం కానంత వరకు చావుపుట్టుకల మధ్య తిరుగుతూ ఉంటుంది. మరణానంతరము ప్రయాణము అనివార్యం అని తేలి పోయింది. కాకపోతే, పయన మయ్యేది సూక్ష్మ శరీరము కనుక, స్థూల శరీరం తోడు రాదు. ప్రోగు చేసుకొనిన సంపదలు వెంట రావు. బంధుజనం కలిసి పయనించరు. 
సీ|| ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగ బోదు ధన మెప్పటికి శాశ్వతంబు గాదు దారాసుతాదులు తన వెంట రాలేరు భృత్యులు మృతిని తప్పింప లేరు బంధుజాలము తన్ను బ్రతికించుకో లేదు బలపరాక్రమ మేమి పనికి రాదు ఘనమైన సకల భోగ్యం బెంత గల్గియు గోచి మాత్రం బైన గాంచబోడు 
తే॥ గీ॥ వెర్రి కుక్కల భ్రమలన్ని విడచి నిన్ను భజన చేసెడి వారికి పరమ సుఖము భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస ! దుష్ట సంహార! నరసింహ! దురితదూర! 
దేహము ఈ లోకంలో వెయ్యేండ్లు ఉండేది కాదు. ధనము ఎవరి దైనా అనిత్యమే. తనువు చాలించి పయనమయ్యే నాడు భార్యాబిడ్డలు వెంట రారు. సేవకు లెందరున్నా మరణాన్ని నివారించ లేరు. బంధువులు బ్రతికించుకో లేరు. శక్తిసామర్థ్యాలు మరణంలో ఉపకరించవు. గొప్ప సంపద లున్నా, పోయే నాడు గోచి కూడా తోడు ఉండదు అని నరసింహ శతకము. తోడు వచ్చేవి, తోడు నడిచేవి ఇంద్రియాలు అయిదు, మనస్సు ఆరవది (మనః షష్టానీంద్రియాణి ). వాటిని పవిత్రంగా ఉంచుకోవాలి. దివ్యంగా మలచుకోవాలి. వెంట వచ్చేవి అవే కనుక, అవి మంగళకరంగా ఉంటే, తరువాత జన్మ శోభాయమానంగా ఉంటుంది. అలా ఇంద్రియ మనస్సులను పవిత్రం చేసుకొనే ప్రక్రియను భాగవతం దివ్యంగా వివరించింది. 
సీ॥ కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి 
తే॥ గీ॥ దేవ దేవుని జింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభి నీ ధవు జెప్పెడి గురుడు గురుడు తండ్రి హరి జేరుమని యెడి తండ్రి తండ్రి ! 
అంటూ ఇంద్రియ మనోబుద్ధులను ఎక్కడ నియమిస్తే పవిత్ర మౌతాయో, ఎలా వినియోగించుకుంటే బ్రతుకు భవ్య మౌతుందో తెలుపుతూ ప్రహ్లాదుడు ముముక్షువులకు మార్గ నిర్దేశం చేశాడు. మరణానంతరము జీవుని వెంబడించి వచ్చేవి ఇంద్రియాలు, మనస్సే కనుక వాటిని ఇప్పుడే, ఇక్కడే పవిత్రం చేసుకోవాలి. కర్మేంద్రియాలైన హస్తాలు దైవపూజలో, భగవత్కార్యాలలో సదా పునీతం కావాలి. భగవంతుని స్మరించేందుకు అనువైన పరమేశ్వర సన్నిధికి, సంత్ పురుషుల సదనాలకు నిత్యము నడక సాగుతూ ఉండాలి. కరచరణాదులు కర్మేంద్రియ సమూహానికి ఉపలక్షణము. ఈ విధంగా కర్మేంద్రియాలను పునీతం చేసుకుంటే, ఉత్తర జన్మలలో కర్మేంద్రియాలన్నీ వాటి వాటి కార్యాలను భగవన్ముఖంగా కొనసాగించి బ్రతుకుకు ధన్యతను చేకూర్చుతాయి. అలాగే, శ్రోత్రాది జ్ఞానేంద్రియాలను కూడా నిత్యము జ్ఞానగంగలో పవిత్ర మయ్యే లాగా శ్రద్ధ వహించాలి. మహాత్ముల దర్శనంతో, మాధవ సందర్శనంతో నేత్రాలను, దివ్య శ్రవణంతో వీనులను, పవిత్ర భాషణంతో, దివ్య నామ సంకీర్తనముతో నాలుకను పునీతం చేసుకోవాలి. కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను భగవ త్సంబంధమైన కర్మయోగ, జ్ఞానయోగ సాధనలలో పవిత్రం చేసుకున్నట్లు, మనోబుద్ధులను సదా భగవ చ్చింతనము, ఆత్మవిచారము, దైవ ధ్యానాలతో మంగళకరంగా మార్చుకోవాలి. వైభవోపేతమైన ఈ సాధనల ఫలితంగా ఉత్తర జన్మలు కూడా భగవన్మయ మవుతాయి. ఈ విధంగా దేహ పతనానంతరము వెంట వచ్చే వాటి విషయంలో ప్రతి ఒక్కరు సావధానులై ఉండాలి. జీవుడు జన్మాంతర ప్రస్థానంలో ఎందుకని ఇంద్రియ మనోబుద్ధులను తీసుకొని పోతున్నాడో, ఆ విషయాన్ని వివరిస్తున్నాడు

No comments:

Post a Comment